Home |  | Audio |  | Index |  | Verses

లేవీయకాండము Leviticus

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27
1 ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి
2 యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలి పీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.
3 ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమ ములలో అది అతిపరిశుద్ధము.
4 నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు, పొంగనిదియునైన గోధుమపిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలేగాని కావలెను.
5 నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను.
6 అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను.
7 నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన యెడల నూనె కలిసిన గోధుమపిండితో దానిని చేయవలెను.
8 వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవాయొద్దకు తేవలెను. యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను
9 అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాప కార్థముగా తీసి బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను.
10 ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.
11 మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగినదానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు.
12 ప్రథమఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠముమీద ఇంపైన సువాసనగా వాటి నర్పింప వలదు.
13 నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చ వలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.
14 నీవు యెహోవాకు ప్రథమఫలముల నైవేద్య మును చేయు నప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను.
15 అది నైవేద్యరూప మైనది, నీవు దానిమీద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను.
16 అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజ కుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.

ముద్రించు Print This Page

పైన Top |  | తదుపరి పేజీ  |  | Index |  | Home


Full online version here [with search engine, multilingual display and audio Bible]