Home |  | Audio |  | Index |  | Verses

యోబు గ్రంథము Job

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42
1 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను
2 జ్ఞానములేని మాటలు చెప్పిఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
3 పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
5 నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.
6 దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
7 ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును1 ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
8 సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?
9 నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా?
10 దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
11 నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
12 అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించు నట్లును
13 అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?
14 ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కన బడును.
15 దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.
16 సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
17 మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
18 భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
19 వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
20 దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు నీకు తెలిసియున్నది గదా.
21 నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
22 నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
23 ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?
24 వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
25 నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
26 పాడైన యెడారిని తృప్తిపరచుటకునులేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను
27 ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
28 వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
29 మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
30 జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
31 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
32 వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
33 ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?
34 జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
35 మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
36 అంతరింద్రియములలో2 జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు3 తెలివి నిచ్చినవాడెవడు?
37 జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
38 ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు?
39 ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
40 సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
41 తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?

ముద్రించు Print This Page

పైన Top |  | తదుపరి పేజీ  |  | Index |  | Home


Full online version here [with search engine, multilingual display and audio Bible]