Home |  | Audio |  | Index |  | Verses

ప్రసంగి Ecclesiastes

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12
1 ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.
2 ​పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు,
3 ​చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;
4 ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;
5 రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగ లించుటకు కౌగలించుట మానుటకు;
6 ​వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు;
7 చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;
8 ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.
9 ​కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి?
10 నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచి తిని.
11 దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.
12 కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసి కొంటిని.
13 మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చు కొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవు డిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.
14 దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు.
15 ​ముందు జరిగినదే ఇప్పుడును జరుగును; జరుగబోవునది పూర్వమందు జరిగి నదే; జరిగిపోయినదానిని దేవుడు మరల రప్పించును.
16 మరియు లోకమునందు విమర్శస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను.
17 ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయ మున్నదనియు, నీతిమంతుల కును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని.
18 కాగా తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అను కొంటిని.
19 నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.
20 ​సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.
21 ​నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును?
22 కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము.

పైన Top | अगला-  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]