Home |  | Audio |  | Index |  | Verses

ఫిలిప్పీయులకు Philippians

అధ్యాయం: 1 2 3 4
1 ఫిలిప్పీలో ఉన్నక్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధుల కును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయు నది.
2 మన తండ్రియగు దేవునినుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.
3 ముదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి,
4 మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.
5 గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు,
6 నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
7 నా బంధకముల యందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.
8 క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి.
9 మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు,
10 ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసు క్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన
11 వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.
12 సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను.
13 ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారి కందరికిని తక్కినవారి కందరికిని స్పష్ట మాయెను.
14 మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి.
15 కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచిబుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు.
16 వారైతే నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు;
17 వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడియున్నాననియెరిగి, ప్రేమతో ప్రకటించుచున్నారు.
18 అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రక టింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును.
19 మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగా నైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని
20 నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మనాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణ మించునని నేనెరుగుదును.
21 నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
22 అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు.
23 ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు.
24 అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది.
25 మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసి యుండుటచేత నన్నుగూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు.
26 మీరు విశ్వాసమునందు అభి వృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును.
27 నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావమఇుతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.
28 అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై యున్నది. ఇది దేవునివలన కలుగునదే.
29 ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి యున్నందున
30 క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.

Top |  | తదుపరి పేజీ  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]